వ్యామోహం
పాండు రంగాపురంలో రంగయ్య శెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు. చిల్లర కొట్టు వ్యాపారం ఉండేది. న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ అతిధి, అభాగ్యగులను ఆదరిస్తూ భగవంతుడి యందు భక్తి కల్గివుండేవాడు.
ఒకనాడు ఆయన ఇంటికి ఒక యోగి వచ్చాడు. వచ్చిన అతిథికి చక్కని భోజనం పెట్టి నూతన వస్త్రాలు ఇచ్చి ఘనంగా సత్కరించాడు. ఆ యోగి శెట్టి గారి ధైవభక్తికి అతిధి మర్యాదలకు ముచ్చట పడి “నాయనా! నీ ధైవభక్తికి ఆనందం కలిగింది. నీకు ఈ జన్మలోనే మోక్షం కలిగించాలని అనుకుంటున్నాను” అన్నాడు.
“స్వామి! మీరు మహానుభావులు, మోక్షం ఇప్పిస్తామంటున్నారు. అంత కంటే నాకు కావాల్సింది ఏముంది. కానీ నాదో మనవి. నా బిడ్డలు ఇప్పుడిప్పుడే పైక్కివస్తున్నారు. పిల్లా పాపలతో వారు సుఖంగా ఉంటే చూచి ఆనందించి వస్తాను. దయచేసి మరోసారి రండి” అన్నాడు.
యోగి, “సరే! అలాగే మరోసారి వస్తాను” అంటూ వెళ్ళిపోయాడు. శెట్టిగారు కొడుకులకు వివాహాలు అయిపోయాయి. ఇద్దరికి కొడుకులు పుట్టారు. వ్యాపారాలు చూసుకుంటున్నారు. హాయిగా కాలం గడుపుతున్నాడు. అయిదేళ్ల తరువాత యోగి మళ్లీ వచ్చి “ఏం నాయనా! మరి వెళ్దామా! మోక్షం ఇప్పిస్తాను” అన్నాడు.
శెట్టిగారు “యోగీంద్రా! నా భార్య గతించింది. ఆమె తిరిగి మా ఇంటిలో మహాలక్ష్మిలా పుడుతుందట. ఆ ముచ్చటా చూచి వస్తాను. తమరు మళ్లీ రండి” అన్నాడు.”సరే! నాయనా ఈసారి మళ్లీ వస్తాను. అప్పుడు మాత్రం కాదనకుండా రావాలి” అంటూ వెళ్ళిపోయాడు.
అలా వెళ్లిన యోగి మరో పది ఏళ్ళ తరువాత మల్లి వచ్చాడు. శెట్టిగారు కన్పించలేదు. శెట్టి గారు ఎక్కడ అని అడిగితే అయన ఎప్పుడో చనిపోయాడు, ఇదిగో! ఆ పూరి ఇంట్లో శెట్టిగారు పెద్ద కుమారుడు వుంటున్నాడు అంటూ ఒక తోటలోని పూరిపాకను చూపించారు. యోగి ఆ ఇంటివద్దకు వెళ్లి, కొట్టంలో ఎద్దు ఒకటి ఎండుగడ్డి నములుతూ కనిపించింది. యోగి ఎద్దు వద్దకు వెళ్లి దివ్య దృష్టితో అంతా తెలుసుకొని తన కమండలంలోని నీళ్లు ఎద్దుపై జల్లాడు. ఉలిక్కిపడి ఆ ఎద్దు తల ఎత్తి చూచింది. ” ఏం నాయనా! వస్తావా వెళదాం” అన్నాడు యోగి.
ఆ ఎద్దు “అయ్యా నమస్కారం, నా కొడుకులు తగాదాలతో ఆస్థిపాస్థులు అన్నీ పోగొట్టుకున్నారు. బ్రతకడానికి పెద్ద కొడుకు ఒక ఎద్దుబండి తోలుకుంటూ దానిపై వచ్చే కొద్దీ రాబడితో భారంగా బతుకు ఈడుస్తున్నాడు. రెండో కొడుకు బర్రెగొడ్డును పెట్టుకొని పాలు అమ్ముకుంటూ బతుకుతున్నాడు. అలా చనిపోయిన నేను నా పెద్ద కొడుకు పంచలో ఎద్దుగా పుట్టి వాడి జీవనోపాధికి ఆధారమయ్యాను.
నా భార్య నా చిన్న కొడుకు ఇంట్లో బర్రెగొడ్డుగా పుట్టి వాడి బతుకు తెరువుకి పాలిస్తూ వాడిని బతికిస్తుంది. ఇలా చాలీ చాలని సంపాదనతో నా కొడుకులు అందరూ బతుకు బండి లాగుతున్నారు. వారి జీవనాధారానికి ఆధారమైన నేను నీతో వస్తే వారి బ్రతుకులు ఏంకాను! చూస్తూ చూస్తూ వారిని వదిలి ఎలా రాగాలను స్వామి! నన్ను క్షమించండి” అన్నాడు కన్నీరు కారుస్తూ.
“ఆహ! వ్యామోహం ఎంత చెడ్డది. ఎవరి కర్మకు, ఎవరు కర్తలు, ఎంత వారికైనా విధిని దాటడం అసాధ్యం అనుకుంటూ వెళ్ళిపోయాడు యోగి.
కథ యొక్క నీతి: వ్యామోహం మరియు పరపతి లొంగకపోవడం మానవుల యొక్క కర్మను అధిగమించలేవు.