వ్యత్యాసం



చంద్రాపీడుడు కాంచన నగరపు రాజు. ఆయన వద్ద ధవళముఖుడని ఒక సేవకుడుండేవాడు. ధవళముఖుడు ఏ రోజు కూడా కొలువునుంచి నేరుగా ఇంటికి వచ్చే వాడు కాడు. ఎక్కడో ఒక చోట భోజనం చేసి తాంబూలం వేసుకుని, బాగా పొద్దు పోయింతర్వాత ఇల్లు చేరుకునేవాడు.

ధవళముఖుడి భార్య ఒక రోజు తన భర్తను “మీరు ప్రతిరోజూ ఎక్కడో భోజనం చేసి వస్తారు కదా, ఎవరు మీకు భోజనం పెడతారు? ఎందుకు పెడతారు?” అని అడిగింది.

ధవళముఖుడు భార్యతో, “నాకు ఇద్దరు మంచి స్నేహితులున్నారు. అందులో ఒకడు కల్యాణవర్మ అనేవాడు. అతను నాకు తన వద్ద ఉన్నది ఏది కావాలన్నా ఇస్తాడు. ఇక రెండో వాడు వీరబాహు అనేవాడు. అతను నాకు ప్రాణస్నేహితు డంటే అవసరమైతే నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తాడు” అన్నాడు.

తన భర్తకు అంత గొప్ప స్నేహితులున్నా రని విని ధవళముఖుడి భార్య చాలా సంతో షించింది. “నాకు మీ మిత్రులను ఒకసారి చూపుతారా?” అని భర్తనడిగింది.

“దానికేం భాగ్యం? రేపు నా వెంటరా, ఇద్దరి ఇళ్లకూ వెళ్లివద్దాం,” అన్నాడు ధవళ ముఖుడు.

మర్నాడు ఉదయం భార్యాభర్తలిద్దరూ కల్యాణవర్మ ఇంటికి వెళ్లారు. అతడు వారిని గొప్పగా సత్కరించాడు. తన భర్త చెప్పినదానిలో అతిశయోక్తి లేదని ధవళ ముఖుడి భార్య తెలుసుకున్నది. తరవాత ఆ దంపతులిద్దరూ వీరబాహు ఇంటికి వెళ్లారు. చదరంగం ఆడుతున్న వీరబాహు, ధవళ ముఖుడి కేసి ఒకసారి చూసి “ఏమోయ్, వచ్చావా? కూచో” అని తిరిగి ఆటలో నిమగ్నుడ య్యాడు.

భార్యాభర్తలు కొంచెంసేపు కూచుని ‘వెళ్లివస్తాం,’ అన్నారు. వీరబాహు తల ఎత్తకుండానే, ‘మంచిది’ అన్నాడు.

ధవళముఖుడితో భార్య, ‘కల్యాణవర్మ కన్న వీరబాహు మీకు మంచి స్నేహితుడని చెప్పారుగదా, ఇతనికన్న అతనే మనని ఎంతో ఆదరంగా చూశాడే?’ అన్నది.

‘వారిద్దరి మధ్యా గల వ్యత్యాసం చూడా లంటే, రేపు నువు ఇద్దరిదగ్గరికి వెళ్ళి, నామీద రాజుగారికి ఆగ్రహం వచ్చిందని చెప్పు,’ అన్నాడు ధవళముఖుడు భార్యతో. ఆమె మర్నాడు ముందుగా కల్యాణ వర్మ ఇంటికి వెళ్లి అతనితో, ‘అయ్యా, నా భర్తపై రాజుగారు అలిగారు. మీరు మీ మిత్రుడికి సహాయపడగలరా?’ అని అడిగింది. కల్యాణవర్మ హడలిపోయి, ‘అమ్మా, నేను వర్తకం చేసుకునేవాణ్ణి. రాజుగారిని ఎదిరించి నేనేం చేయగలను. నీ భర్త దేశం వదిలి పారిపోవడం మంచిది.” అన్నాడు.

ధవళముఖుడి భార్య వీరబాహు ఇంటికి వెళ్లి అతనితో కూడా అదే మాట చెప్పింది. ఈ మాట వింటూనే వీరబాహు డాలూ, కత్తి పట్టుకుని ఆమె వెంట బయలుదేరి వచ్చి ధవళముఖుడితో, ‘మిత్రమా నీమీద రాజుకు కోపం తెప్పించిన తుచ్చుడెవడో చెప్పు! వెంటనే ఆ పాపాత్ముడిని హతమార్చుతాను!’ అన్నాడు ఆవేశంతో.

ధవళముఖుడు నవ్వుతూ, ‘కూచో వోయ్. మంత్రిగారు రాజుగారిని నా పట్ల సుముఖుణ్ణి చేశారులే!’ అన్నాడు. అతడు వెళ్లిపోయాక, ధవళముఖుడు భార్యతో, ‘చూసావు గదా, నా ఇద్దరు మిత్రులలో గల వ్యత్యాసం!’ అన్నాడు.

కథ యొక్క నీతి: నిజమైన స్నేహితులు సప్పోర్టు చేస్తారు; ఒకరు మన ఊహల్లో గొప్పవారిగానూ, మరొకరు మనకు అవసరమైనప్పుడు అండగా నిలబడగలుగుతారు.

Responsive Footer with Logo and Social Media